అమెరికా నౌకలపై డాల్ఫిన్లతో దాడికి ఇరాన్ కుట్ర?.. అసలు విషయం చెప్పిన యూఎస్

  • హ‌ర్మూజ్ జలసంధిలో అమెరికా నౌకలపై దాడికి ఇరాన్ డాల్ఫిన్లను వాడుతుందన్న ప్రచారం
  • ఇరాన్ వద్ద డాల్ఫిన్ సైన్యం లేదని స్పష్టం చేసిన అమెరికా రక్షణ మంత్రి
  • తమ వద్ద 'కామికేజ్ డాల్ఫిన్లు' ఉన్నాయో లేదో చెప్పలేనంటూ వ్యాఖ్య
  • మైన్లను గుర్తించేందుకే అమెరికా డాల్ఫిన్లను వాడుతోందని వెల్లడి
హ‌ర్మూజ్ జలసంధిలో వాణిజ్య నౌకల రాకపోకలకు ఇరాన్ మైన్లతో అంతరాయం కలిగించవచ్చన్న ఆందోళనల మధ్య, అమెరికా నౌకాదళాన్ని ఎదుర్కొనేందుకు టెహ్రాన్ "కామికేజ్ డాల్ఫిన్లను" రంగంలోకి దించనుందంటూ వస్తున్న వార్తలపై తీవ్ర చర్చ జరుగుతోంది. ఈ ఊహాగానాలపై అమెరికా రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్ స్పందించారు. ఇరాన్ వద్ద అటువంటి డాల్ఫిన్ సైన్యం లేదని ఆయన స్పష్టం చేశారు. అయితే, అమెరికా వద్ద ఉన్నాయా? అనే ప్రశ్నకు మాత్రం సమాధానం దాటవేశారు.

"మా వద్ద కామికేజ్ డాల్ఫిన్లు ఉన్నాయో? లేదో? నేను ధ్రువీకరించలేను. అలా అని ఖండించలేను. కానీ, ఇరాన్ వద్ద మాత్రం అవి లేవని కచ్చితంగా చెప్పగలను" అని ఒక మీడియా సమావేశంలో హెగ్సెత్ అన్నారు. ఏప్రిల్ 30న వాల్ స్ట్రీట్ జర్నల్ ప్రచురించిన ఒక కథనంతో ఈ చర్చ మొదలైంది. అమెరికా యుద్ధ నౌకలపై దాడి చేసేందుకు ఇరాన్ "మైన్లు మోసుకెళ్లే డాల్ఫిన్లను" ఉపయోగించవచ్చని ఆ కథనం పేర్కొంది.

మరోవైపు అమెరికా నౌకాదళం దశాబ్దాలుగా డాల్ఫిన్లను సైనిక అవసరాలకు వినియోగిస్తోంది. యూఎస్ నేవీకి చెందిన "మెరైన్ మమ్మల్ ప్రోగ్రామ్" కింద బాటిల్‌నోస్ డాల్ఫిన్లు, కాలిఫోర్నియా సీ లయన్‌లకు శిక్షణ ఇస్తున్నారు. అయితే, ఇవి ఇరాన్ వాడొచ్చని ప్రచారంలో ఉన్న "కామికేజ్ డాల్ఫిన్ల" వంటివి కావు. అమెరికా డాల్ఫిన్లు కేవలం సముద్ర గర్భంలో మైన్లను గుర్తించి, వాటి లొకేషన్‌ను మార్క్ చేస్తాయి. అంతేగాని, ఆత్మాహుతి దాడులు చేసి ప్రాణాలు త్యాగం చేయవు. "డాల్ఫిన్ల సోనార్ వ్యవస్థ ముందు సైన్స్‌కు తెలిసిన ఏ టెక్నాలజీ సరిపోదు. నీటి అడుగున పనిచేసే డ్రోన్‌లు కూడా వీటికి సాటిరావు" అని ఈ ప్రోగ్రామ్ వెబ్‌సైట్ పేర్కొంది.

గతంలో రష్యా తమ నౌకాశ్రయాల భద్రతకు డాల్ఫిన్లను వాడింది. 2000 సంవత్సరంలో ఇరాన్ కూడా కొన్ని డాల్ఫిన్లను కొనుగోలు చేసింది. అయితే, అవి ఇప్పుడు వయసు పైబడటం వల్ల ఉపయోగంలో ఉండే అవకాశం లేదని, ప్రస్తుతం టెహ్రాన్ వద్ద క్రియాశీల డాల్ఫిన్ ప్రోగ్రామ్ ఉన్నట్లు ఎలాంటి ఆధారాలు లేవని నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతానికి హ‌ర్మూజ్ జలసంధిలో ఉద్రిక్తతలను తగ్గించే ప్రయత్నాల్లో అమెరికా డాల్ఫిన్లను ఉపయోగించడం లేదని సీఎన్ఎన్ కథనం పేర్కొంది.

Kamikaze Dolphins
Pete Hegseth
Iran
US Navy
Marine Mammal Program
Hormuz Strait
Dolphins military
Mine warfare
US defense
Sea Lions

More Telugu News